Menu

Ayali: కట్టుబాట్లను కాలదన్నే టీనేజ్ యువతి.. మెదడులో ఇంకా ఎక్కడైనా బూజు ఉంటే దులిపేస్తుంది!


కట్టుబాట్ల పేరుతో హడావుడి చేసే సంప్రదాయవాదులకు, మతవిశ్వాసాల పేరుతో ఇంగిత జ్ఞానానికి అందని అంశాలను ప్రచారంలో పెట్టే ఈ తరం సోకాల్డ్ ప్రచారకులకు Ayali సిరీస్ కర్రుకాల్చి వాతపెడుతుంది.


PK

పసిమొగ్గలు…లోకం చూడని చిన్నారులు
వాళ్లంతా చెంగుచెంగున ఎగిరే జింకపిల్లలు
ఇంటి వాకిట్లో ..పొలం గట్లపై స్వేచ్ఛాగీతికలు
అమ్మచాటు బిడ్డలు..కల్మషం లేని మనసులు
కానీ ఓ రోజు వస్తుంది
వాళ్ల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుంది
పసిప్రాయాన్ని బంధిఖానాలో వేస్తుంది
యుక్తవయసుకు రావడం అంటే ఏంటో కూడా తెలియని పసితనం వాళ్లది. అమ్మాయి వయసుకొచ్చింది అంటూ బంధుగణమంతా పండగ చేస్తుంటే..తాను కూడా అందులో పరవశించిపోతుంది. ఆ తెల్లారినుంచే ఆమె జీవితాన్ని అదే కుటుంబం, అదే బంధువులు, తనను పెంచి పెద్ద చేసిన ఊరంతా నరకప్రాయంగా మార్చేయబోతుందని ఆ పసిహృదయానికి తెలియదు. స్నేహితుల
ద్వారా కొద్దోగొప్పే తెలిసినా ఎదురించి నిలదీసే ధైర్యం ఆబిడ్డకెక్కడిది ?

కేవలం తమిళనాడులోని ఓ కుగ్రామంలో 500 ఏళ్ల నాటి దురాచారంగానే దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. మన హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ ఇలాంటి అనాగరికపు వాతావరణం ఇప్పటికీ కనిపిస్తుంది. కాలం మారినా, తరాలు మారినా స్త్రీని తమ చెప్పుకిందే ఉంచుకోవాలనే విషపురుగులు మన చుట్టూనే ఉంటారు.
ఇదేదో దాచి పెట్టాల్సిన కథేం కాదు. క్లైమాక్స్ లో మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఆ ఊళ్లో తొమ్మిదో తరగతి దాటి చదివిన అమ్మాయే ఉండదు. ఎందుకంటే బిడ్డ పెద్దమనిషి అవగానే రోజులు, నెలల వ్యవధిలోనే పెళ్లి చేసేస్తారు. అలా పెళ్లి పేరుతో సంకెళ్లు వేయకపోతే ఆ ఊరి మగాళ్లకు నిద్రపట్టదు. యుక్తవయసు వచ్చిన అమ్మాయిని బడికి పంపకూడదని, పొలిమేర దాటించకూడదని వెంటనే పెళ్లి చేయకపోతే అయలి అమ్మవారికి కోపమొస్తుందనేది వాళ్ల పిచ్చి నమ్మకం. వాళ్ల మెదడులో ఇలాంటి నమ్మకం గూడుకట్టుకుపోవడానికి ఓ కట్టుకథ చెబుతారు.

కట్టుబాట్లు వెనుక ఉండేవన్నీ కట్టుకథలే. సంప్రదాయాల పేరుతో ఆ కట్టుబాట్లను బలవంతంగా రుద్ది వాటిని ఎప్పటికీ సజీవంగా ఉండేలా చూస్తుంటుంది సమాజంలోని ఓ వర్గం. వాటిని ఆచరిస్తూ వంతపాడేవాళ్లు, ప్రశ్నించి ఎదురుతిరిగితే ప్రాణాలు తీసేవాళ్లు ఎలాగూ ఉంటారు. మహిళలను కట్టుబానిసలుగా చూస్తూ వాళ్లను గడపదాటకుండా చూసే సోకాల్డ్ మేల్ మైండ్ సెట్స్ గురించే
ఇదంతా. నీకు నచ్చినట్టు కాదు…నేను చెప్పినట్టు..నాకు నచ్చినట్టు ఉండాలి . ఇదే కదా తరతరాలుగా నడుస్తున్న చరిత్ర.
చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తుంది. అదే జరిగితే ఆ ఊరిలో ఆధిపత్యం చెలాయిస్తున్న మగరాయుళ్ల గుండెల్లో గునపంగా మారుతుంది. అది జరగకూడదంటే పిల్ల పెద్దదవగానే మూడు ముళ్లు వేయించి గడప దాటనీయకుండా చేయాలి. అదే చేస్తారు ఆ ఊరి జనం. కానీ ఎంతకాలం. కచ్చితంగా ఒక రోజు వస్తుంది కదా..!

ఇది మనఊరి సంప్రదాయం..దీనికి ఏ ఆడపిల్లైనా కట్టుబడి ఉండాల్సిందేనంటూ… ఊరు ఊరంతా (ఇందులో మహిళలు కూడా ఉండటం మరో విషాదం ) యుక్తవయసు వచ్చిన అమ్మాయిలపై బలవంతంగా కట్టుబాట్లను రుద్దుతుంటే… ఒకే ఒక్క అమ్మాయి మాత్రం తిరగబడుతుంది. మీ దిక్కుమాలిన కట్టుబాట్లతో నా ఆశలను చంపేయకండి అంటూ ఊరికి ఎదురుతిరుగుతుంది.
ఆమె పోరాటమే ఈ Ayali వెబ్ సిరీస్. కట్టుబాట్లను కాలదన్నే టీనేజ్ యువతిగా లీడ్ పాత్రలో నటించిన అభినక్షత్రను చూస్తుంటే మన ఇంటి అమ్మాయే అనిపిస్తుంది.

చిన్నప్పటి నుంచి తాను చూసిన సామాజిక, మతపరమైన కట్టుబాట్లనే ఈ వెబ్ సిరీస్ లో పాత్రలుగా మార్చాడు దర్శకుడు ముత్తుకుమార్. పసిమొగ్గలుగా ఉన్నప్పుడే స్త్రీల హక్కులను ఎలా కాలరాస్తారో.. అందుకోసం ఊరు ఊరంతా ఎలా ఏకమవుతుందో చక్కగా చూపించారు. పల్లె వాతావరణాన్ని మట్టిమనుషులను చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంది. తమిళనాట ఈ వెబ్ సిరీస్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కట్టుబాట్ల పేరుతో హడావుడి చేసే సంప్రదాయవాదులకు, మతవిశ్వాసాల పేరుతో ఇంగిత జ్ఞానానికి అందని అంశాలను ప్రచారంలో పెట్టే ఈ తరం సోకాల్డ్ ప్రచారకులకు Ayali సిరీస్ కర్రుకాల్చి వాతపెడుతుంది. మన మెదడులో ఇంకా ఎక్కడైనా బూజు ఉంటే దులిపేస్తుంది.

-ఫణికుమార్

Also Read: ఇది కేవలం సినిమా కాదు.. దర్శకుడు ఎంతో బాధ్యతతో స్పృశించిన సామాజిక అంశం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *