అస్థిత్వాన్ని త్యజించే ఓ ప్రయాణం
గాలి,ధూళిగా మారిన ఓ జీవితం
అనామకుడి నుంచి అనామకుడి వరకు
ఎక్కడి నుంచి వచ్చామో అక్కడకు
కొన్ని అనుభూతులను ఒడిసిపట్టలేం
కొన్ని ప్రయాణాలను మాటల్లో వర్ణించలేం
ఇది కూడా అంతే ఓ పొయిటిక్ ఎక్స్ప్రెషన్
ఫిలాసాఫికల్ దృశ్యకావ్యం
ఈ సినిమా గురించి మాట్లాడుతూ
ఇది అందరి కోసం కాదంటాడు..రాజ్. బి. శెట్టి
అవును నిజమే. ఇది అందరి కోసం కాదు
ఎందుకంటే ఇందులో పాత్రలు రాలిపోతూ ఉంటాయి
భారమైన ప్రయాణాలు చేసిన గుండెలు
అలసి శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోతాయి
తమ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతోందని…
మృత్యువు తమను వెతుక్కుంటూ వచ్చేస్తుందని
ఏ క్షణమైనా తాము చరిత్రలో కలిసిపోతామని వాళ్లకు తెలుసు
బాధను భరించే వాళ్లు కొందరైతే..
త్వరగా విముక్తి పొందాలనని కోరుకునేవాళ్లు ఇంకొందరు
వాళ్లను గుండెలకు హత్తుకుంటుంది ప్రేరణ
అలాంటి వాళ్ల మధ్యకొస్తాడు ఓ అనామకుడు
అతనో ప్రేమికుడు
అతనో భావకుడు
అతనో తాత్వికుడు
ప్రకృతిని ప్రేమించి అలౌకిక ఆనందాన్ని పొందే
ఆ అనామకుడు ప్రేరణతో సంభాషిస్తాడు..
ప్రేరణకు కొత్త లోకం చూపిస్తాడు..
వాళ్లిద్దరూ మనకు పంచే ప్రేమామృతమే
స్వాతి ముత్తిన మళె హనియే
పెళ్లైన ప్రేరణ… చావు అంచుల్లో ఉన్న అనికేత్
వాళ్లబంధానికి ఎలాంటి పేరూ పెట్టలేం
పేరుకే అతను అనికేత్..కానీ అది
తన అస్థిత్వం కాదు..వాస్తవానికి అతను
ఎలాంటి అస్థిత్వాన్ని కోరుకోడు…
ఇది నేను..ఇది నాది అనే భావనకు దూరమతడు
అతనిదొక అలౌకిక ప్రపంచం
సమస్త మానవాళిలో తానొక భాగమని నమ్మే
తాత్విక చింతన అతని సొంతం
కొండప్రాంతంలో చెరువు ఒడ్డున సేదతీరుతూ
కవిత్వం రాసుకుంటాడు. ఆ చెరువును కూడా
ఓ పాత్రగానే చూడాలి మనం.
ఈ సినిమాను ప్రేక్షకుడు ఆస్వాదించేలా
ప్రేరణ కలిగించే పాత్రే ప్రేరణ.
సిరిశివకుమార్ ఆ పాత్రకు ప్రాణం పోసింది
భర్త అనురాగానికి దూరమైన ప్రేరణ
కౌన్సిలర్ గా అనికేత్తో చేసే ఆ స్వల్ప ప్రయాణం వర్ణణాతీతం
అనామకుడిగా అనికేత్ అంతర్ధానమయ్యే వేళ
చరాచరాజీవరాశుల్లో, ప్రకృతిలో ఒకడిగా చేరుకునే వేళ
వాళ్లిద్దరి మధ్య సాగే సంభాషణలు, ప్రేరణ పలికించే భావాలు
మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి
ఈ సినిమాలోని పాత్రలే కాదు..
వాన చినుకులు… కొండ కోనలు..
మంచు బిందువులు మనతో మాట్లాడతాయి
స్వాతి నక్షత్రం నుంచి జాలువారిన వానచినుకై
మన గుండెను తాకుతుంది ఈ చిత్రం
కన్నడ చిత్ర పరిశ్రమలో రాజ్. బి. శెట్టిది
ప్రత్యేక పేజీ. దర్శకుడిగా , నటుడిగా, రచయితగా
అతని ఆలోచనలో నుంచి పుట్టే ప్రతి దృశ్యం
సుందర కావ్యమే.
-ఫణికుమార్