Menu

Kaathal – The Core: ఇది కేవలం సినిమా కాదు.. దర్శకుడు ఎంతో బాధ్యతతో స్పృశించిన సామాజిక అంశం!


ఇలాంటి కథను ఎంచుకోవడానికి, తెరక్కించడానికి, అందులో నటించడానికి ఎన్ని గట్స్ ఉండాలి? గళ్ల లుంగీలు కట్టి కుర్చీ మడత పెట్టే పనిలో మన తెలుగు సినిమా బిజీగా ఉంటే… సమాజం చర్చించడానికి కూడా ఇష్టపడని సామాజిక ఆంశాన్ని ధైర్యంగా తెరకెక్కించింది మలయాళ సినీ పరిశ్రమ.


PK

ఇవాళైనా నాతో పడుకుంటావా ..!
గుండె నిండా కన్నీళ్లు నింపుకున్న ఓ భార్య…
పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్తను ఓ రాత్రి అడుగుతుంది
ఆ మాట వింటూ ఉద్వేగానికి లోనైన ఆ భర్త
దేవుడా ఏంటి నాకీ శిక్ష అంటూ దగ్గరకు తీసుకుంటాడు
కన్నీటి కౌగిలితో వాళ్లిద్దరూ ఒక్కటైనా
వాళ్ల శరీరం, మనసుల మధ్య అగాధం పూడ్చుకోదు
పెళ్లైతే అన్నీ సర్దుకుంటాయ్…. మన సమాజంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు గాడి తప్పినా… ఎలాంటి సమస్యలు చుట్టు ముట్టినా పెళ్లైతే అన్నీ సర్దుకుంటాయ్ అంటూపెద్దోళ్లు చెబుతుంటారు. అభిప్రాయాలు, ఆలోచనలు, మానసిక స్థితులతో సంబంధం లేకుండా తాయిత్తు మంత్రం వేసినట్టు అన్నీ సర్దుకుంటాయని అనుకుంటారు. కానీ పెళ్లైతే అన్నీ సర్దుకుంటాయా….
ఇదే ప్రశ్న ఆ భర్త తన తండ్రిని అడుగుతాడు.

నాన్నా… పెళ్లైతే అన్నీ సర్దుకుంటాయి అన్నావ్ కదా…
ఇప్పుడేమైంది నాన్నా అంటూ తండ్రిని పట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు..
ఏదో ఒక రోజు తన కొడుకు ఈ ప్రశ్నతో నిలదీస్తాడని
వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి తెలుసు.
కొడుక్కి ఆ మాట చెప్పి పెళ్లైతే చేశాడు… కానీ అన్నీ సర్దుకుపోలేదు.
తాను చేసిన తప్పుకు కొడుకు, కోడలు వైవాహిక జీవితం నాశనమైపోయిందని
ఆ పెద్దాయన గుర్తించడానికి 20 ఏళ్లు పట్టింది.

యుక్తవయసులోకి వచ్చిన తన కొడుకు హోమోసెక్సువల్ అని ఆ తండ్రికి తెలుసు. మరో యువకుడితో కొడుకికి ఉన్న సంబంధం గురించి కూడా ఆయనకు తెలుసు. కానీ దాన్ని ఆయన అసహజంగా భావిస్తాడు. నలుగురికి తెలిస్తే తన కుటుంబం పరువు ఏమవుతుందో అని భయపడతాడు. LGBTQ+ కమ్యూనిటీ, క్వీర్ పీపుల్ పై కనీస అవగాహన లేని ఆ తండ్రి కొడుక్కి పెళ్లి చేయడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని నమ్ముతాడు. తన మనసు, శరీరం మరో పురుషుడ్ని కోరుకుంటున్నా….ఆ విషయాన్ని ధైర్యంగా తండ్రికి చెప్పలేని ఆ కొడుకు అయిష్టంగానే పెళ్లి చేసుకుంటాడు. నాన్నా…ఎందుకిలా చేశావ్ అని ఆ తండ్రిని నిలదీయడానికి ఆ కొడుక్కి 20 ఏళ్లు పడుతుంది.

ఇలాంటి కథను ఎంచుకోవడానికి, తెరక్కించడానికి, అందులో నటించడానికి ఎన్ని గట్స్ ఉండాలి? గళ్ల లుంగీలు కట్టి కుర్చీ మడత పెట్టే పనిలో మన తెలుగు సినిమా బిజీగా ఉంటే… సమాజం చర్చించడానికి కూడా ఇష్టపడని సామాజిక ఆంశాన్ని ధైర్యంగా తెరకెక్కించింది మలయాళ సినీ పరిశ్రమ.

Kaathal – The Core ఇది కేవలం సినిమా కాదు..Need of the hour. గ్రేట్ ఇండియన్ కిచెన్ వంటి అద్భుత చిత్రాన్ని అందించిన దర్శకుడు Jeo Baby ఎంతో బాధ్యతతో స్పృశించిన సామాజిక అంశం కాదల్ ది కోర్. మన తెలుగు సోకాల్డ్ హీరోలకు ఈ కథను చెబితే కచ్చితంగా తిరస్కరించేవాళ్లు. కానీ మమ్ముట్టి ఆ పని చేయలేదు. ఎందుకంటే కలెక్షన్ల సునామీలు, హీరోయిజాలు నెత్తికెక్కిచ్చుకోని బాధ్యతాయుమైన నటుడు ఆయన. అందుకే కథ అవసరాన్ని గుర్తించి గేగా నటించాడు.

LGBTQ+ కమ్యూనిటీ, క్వీర్ పీపుల్ అంటే మనకు చాలా చిన్నచూపు. హాస్యం పేరుతో వాళ్ల పాత్రను లేకిగా చిత్రీకరించడం దగ్గరే మన తెలుగు సినిమా ఆగిపోయింది. కానీ Jeo Baby ఆ పని చేయలేదు. సమాజం అర్థం చేసుకోని వాళ్ల జీవితాలను, వాళ్ల ఆలోచనలను ఎంతో బాధ్యతతో తెరపైన చూపించాడు. మమ్ముట్టి , జ్యోతిక పాత్రలను సహజంగా నడిపించారు.
పార్టీ ఆదేశాల మేరకు స్థానిక ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన మాథ్యూ దేవసి ( మమ్ముట్టి) కి భార్య ఒమన ( జ్యోతిక ) రూపంలో ఊహించని సమస్య ఎదురవుతుంది. హోమో సెక్సువల్ అయిన తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లెక్కుతుంది. 20 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్ట పరంగా ముగింపు కోరుకుంటుంది.

సెక్యువల్ ఓరియంటేషన్ విషయంలో మూడు జనరేషన్స్ తో పాటు సమాజం ఆలోచనా విధానం ఎలా ఉందన్న విషయాన్ని ఆయా పాత్రల ద్వారా మన ముందు చర్చకు పెడతాడు దర్శకుడు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే ప్రేమ, అనురాగం, శారీర సంబంధాలు ఉంటాయని… అదే ప్రకృతి నిర్దేశించిన సహజ ప్రవృత్తి అని భావించే ఓ వృద్ధుడు…
తాను హోమోసెక్సువల్ నని , స్త్రీల పట్ల ఎలాంటి ఆకర్షణ లేని తనకు బలవంతంగా ఓ యువతితో పెళ్లి చేస్తే.. ఎదురించే ధైర్యం లేక ఆ పెళ్లి అనే చట్రంలో 20 ఏళ్ల పాటు నలిగిపోయిన ఆ వృద్ధుడి కొడుకు ( మమ్ముట్టి)
పెళ్లైన కొంతకాలానికే భర్త తన శారీరక అవసరాలు తీర్చలేడన్న విషయాన్ని గుర్తించినా… పెళ్లి కుటుంబం కట్టుబాట్ల నుంచి బయటపడలేకపోయిన అతని భార్య ( జ్యోతిక )

అమ్మానాన్నలు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణకు ముగింపు రావాలని కోరుకునే 18 ఏళ్లు నిండిన వాళ్ల కూతురు…
సమాజం అంటే స్త్రీ, పురుషులేనని.. ఆపై ఎవరు ఉన్నా.. వాళ్లది అసహజమైన జీవితమని… వాళ్ల మధ్య ఉండే సంబంధాలు అసహజమైనవని ఇప్పటికీ భావిస్తున్న మధ్యయుగాల నాటి మనస్తత్వాలకు ఈ అంశం ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు.

సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ మమ్ముట్టి తండ్రి లాంటి వాళ్లు ఉన్నారు. పిల్లల సెక్సువల్ ఓరియంటేషన్ గురించి తెలిసి కొందరు, తెలియక కొందరు వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. క్వీర్ పర్సనాలిటీస్ ను సమాజం పూర్తి స్థాయిలో ఆమోదించకపోవడం కూడా మరో కారణం. తమ సెక్సువల్ ఓరియంటేషన్ గురించి బహిరంగంగా చెప్పుకోలేక , చెప్పుకున్నా అర్థం చేసుకునే వాళ్లు లేక… కుటుంబం, సమాజం వేసే కట్టుబాట్లకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నవాళ్లు ఎంతో మంది.

LGBTQ+ గురించి మాట్లాడుకోవడానికే ఇబ్బంది పడుతూ ఉంటుంది సోకాల్డ్ హెటిరోసెక్సువల్ సమాజం. అదోదే తప్పుడు వ్యవహారమని…వాళ్లేంటి అలా అసహజంగా ఉన్నారు..అంటూ హేళన చేయడానికే ప్రాధాన్యతనిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో కొలీగ్స్ ఇలా ఎవరైనా సరే వాళ్ల సెక్యువల్ ఓరియంటేషన్ భిన్నంగా ఉంటే… అది అసహజం కాదు…రోగమో…జబ్బో అంతకన్నా కాదు….లైంగిక ప్రవృత్తి భిన్నంగా ఉన్నంత మాత్రాన వాళ్లు ఈ సమాజంలో భాగం కాకుండా పోరు అన్న స్పృహ చాలా మందిలో ఉండదు. అసలు సెక్సువల్ ఓరియంటేషన్ విషయంలో ఏది సహజం, ఏది అసహజం అన్న చర్చే అనాగరికమైంది.

మీ భర్తతో ఎన్ని సార్లు శారీరంగా కలిశారు అని మాథ్యూ దేవసి ( మమ్ముట్టి) తరపు లేడీ లాయర్ ఒమన ( జ్యోతిక)ను నిండు కోర్టులో అందరి ముందు ప్రశ్నిస్తుంది. నాలుగు సార్లు అంటూ ఆమె సమాధానం ఇస్తుంది. నెలకు నాలుగు సార్లు అంటే అది హెల్తీ సెక్సువల్ రిలేషనే కదా యువరానర్ అంటూ ఆ లాయర్ ముక్తాయించబోతుంది. వెంటనే జ్యోతిక అందుకుంటుంది. నెలకు కాదు… ఈ 20 ఏళ్లలో అంటుంది. అంతే కోర్టు హాలులో నిశ్శబ్దం.

మాథ్యూ దేవసి ( మమ్ముట్టి )తో గే రిలేషన్ లో ఉన్న వ్యక్తి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణను కూడా చాలా లోతుగా చూపిస్తాడు దర్శకుడు. ప్రేమ అన్న దానికి నిజమైన నిర్వచనం ఈ సినిమాలోని అనేక పాత్రల్లో కనిపిస్తుంది.
భర్త నుంచి విడిపోతూ చివరగా ఓ ప్రశ్న వేస్తుంది. ఇదంతా నా కోసం చేశాననుకుంటున్నావా మాథ్యూ అని…
అతను మౌనంగా ఉంటాడు. అప్పుడు చెబుతుంది. నీది కాని నీ జీవితాన్ని ఇలా ఎంతకాలం కొనసాగిస్తావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్తకు విముక్తి ప్రసాదించానన్న ఆనందం ఆమె కళ్లల్లో కనిపిస్తుంది.

విడాకులు తీసుకున్న తర్వాత స్వయంగా మాజీ భార్యను ఆమె పుట్టింటి దగ్గర దిగబెట్టి వస్తాడు మాథ్యూ . ఆమె జీవితంలోకి మరో వ్యక్తి రావడానికి సాయపడతాడు. క్వీర్ పర్సనాలిటీస్ విషయంలో సమాజం బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలన్న విషయాన్ని దర్శకుడు జ్యోతిక పాత్ర ద్వారా మనకు గుర్తుచేస్తాడు.

-ఫణికుమార్


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *