Menu

Ananth Ambani Marriage: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి.. కంపరం కలిగిస్తోన్న వార్తలు!

Tri Ten B

Ananth Ambani Pre Wedding News: ముఖేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఆయన కొడుకు పెళ్ళి ఆయన వ్యక్తిగత విషయం. ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకున్నా అది జనాలకు అనవసరం. ప్రీవెడ్డింగ్‌కే వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడని.. ఈ డబ్బు పేదవాళ్లకు ఇవ్వచ్చు కదా అని మేధావులు కొందరు అతిగా ఆలోచిస్తున్నారు. కూతురు పెళ్ళి కోసం ఉన్న ఇళ్లు, పొలాలు అమ్ముకునే తల్లిదండ్రులు దేశంలో లెక్కలేనంత మంది ఉన్నారు. వారు చేస్తున్నదాని కంటే అంబానీ చేస్తున్నది ఏ మాత్రం తప్పు కాదు. ఊహించినట్టే అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్‌కు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. మీడియాకు కావాల్సినంత స్టఫ్‌ దొరికింది. ఈ వార్తలు కవర్ చేసుకోవడం, క్యాష్‌ చేసుకోవడం ఏ మాత్రం అనైతికమైనది కాదు. ఆదాయం లేకుండా ఏ సంస్థ కూడా పని చేయలేదు. డబ్బులు అందరికీ అవసరం కూడా. అయితే దేనికైన ఒక లిమిట్‌ ఉంటుంది. ఆ పరిధిని మీడియా సంస్థలు మరోసారి దాటి చికాకు పుట్టించాయి. అంబానీ కొడుకు పెళ్ళి వార్తలను అతిగా కవర్ చేశాయి. ముఖ్యంగా వెబ్‌సైట్లు చూస్తుంటే కంపరం కలుగుతోంది.

ఇంత వెగటు పుట్టించాలా?
నీతా అంబానీ అందానికి ఫిదా అవ్వాల్సిందేనంట.. పెళ్లి జరుగుతున్న తేదీ విశిష్టలు ఇవేనంట.. అనంత్ అంబానీ వాచ్‌ ఖరీదు చూసి ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ భార్య నొరేళ్లబెట్టిందంట. ఏ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానెల్స్‌ థంబ్‌నెయిల్స్‌ చూసినా ఇవే హెడ్డింగులు. వేల కోట్లు ఉన్నా జుకర్‌ బర్గ్‌ ఎప్పుడూ సింపుల్‌గానే కనిపిస్తాడు. బ్రాండ్‌ మోజు లేని వ్యక్తి అతను. అందుకే అనంత్‌ అంబానీ వాచ్‌ ఖరీదు విని అతని భార్య షాక్‌ అయ్యిందేమో. ఎందుకంత ఖరీదు వాచ్‌ అని లోలోపల అనుకుందేమో.. ఇదంతా పక్కన పెడితే అతిలో ట్రేడ్‌మార్క్‌గా నిలిచే టీవీ9 ఓ అడుగు ముందుకేసింది. నీతా అంబానీ డ్యాన్స్‌లో ఆ ఛానెల్‌ వాళ్లకి అమ్మవారు కనిపించారంట. ఆ థంబ్‌నెయిల్‌ చూస్తే రోత పుట్టింది. వ్యూస్‌ కోసం ఇంత వెగటు పుట్టించాలా అనిపించింది. నిజంగా అమ్మవారే ఉంటే చేతిలో త్రీశులంతో పొడుచును..!

ఎటైనా పారిపోతే బెటర్:
వెబ్‌సైట్లలో టాప్‌-10 వార్తలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సైట్ ఓపెన్ చేయగానే కనపడే వార్తలు అవే. నాలుగైదు రోజులుగా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు..ఇలా ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా మొదటి పది వార్తల్లో 5-6 వార్తలు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వార్తలే. ఈ నంబర్ల విషయంలో తెలుగు వెబ్‌సైట్లు కాస్త పర్వాలేదు కానీ కొన్ని హిందీ వెబ్‌సైట్లు మరింత ఘోరంగా కనిపిస్తున్నాయి. నిజానికి అంబానీ పీఆర్‌ టీమ్‌ ఈ ప్రీవెడ్డింగ్‌కి శక్తికి మించి పని చేసింది. అయితే అసలు పీఆరే అవసరం లేకుండా మీడియా కావాల్సినదాని కంటే ఎక్కువ కవరేజ్‌ఇచ్చింది. అసలు మీడియానే ముఖేశ్‌కి పీఆర్‌ చేస్తుందానన్న అనుమానం కూడా కలుగుతోంది. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అని ఊరికే అని ఉండరు. ఈ అతికి కారణం మీడియా సంస్థల్లో పని చేసే సబ్‌ఎడిటర్లు కాదు.. వారి మెనేజ్‌మెంట్లు.. వాళ్లు చెప్పింది చేయాల్సిందే కదా. ఇక ప్రివెడ్డింగ్‌కే ఈ స్థాయి విరక్తి పుడితే పెళ్ళికి ఎలా ఉంటుందోనన్న భయాలు నెలకొన్నాయి. జులై 12న పెళ్ళి అంటున్నారు.. ఒక నెల రోజులు ముందు, తర్వాత ఇంటర్‌నెట్ ఆఫ్‌ చేసి ఏ అడవికో పోతే బెటర్‌!

Also Read: మాంసం తింటే ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరుగుతాయట.. మేధావి మాధవి వైరల్ వీడియో!


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *