Menu

TS Police: జుట్టు పట్టుకుని ఈడ్చిపడేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్..! ఏ ప్రభుత్వంలోనైనా ఖాకీల తీరింతేనా?


ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు.. చేతికి వచ్చింది లాగుతారు.. వెంటపడి జుట్టుపట్టుకుని కిందపడేస్తారు. అటు ప్రతిపక్షం హిపోక్రసీని చూపిస్తుంది. గతంలో పోలీసులంతా ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటిస్తుంది. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ది దొందుదొందే!


Tri Ten B

కొట్టే అధికారం.. జుట్టు పట్టుకుని ఈడ్చే అహంకారం పోలీసులకు ఎవరిచ్చారు? శాంతియుతంగా, ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరసన తెలుపుతున్న వారిని రోడ్డుపై ఉరికించి కిందపడేస్తారా? పోలీసులైనా.. ఎవరైనా భౌతిక హింస తప్పే. కాస్త అటు ఇటుగా అయితే ప్రాణాలే పోతాయ్‌. అందరి పోలీసులు అలానే ఉంటారని కాదు.. పోలీస్‌ వ్యవస్థ అలాంటిదని అసలు నిందించడంలేదు.. ప్రతి ఒక్కరూ కావాలనే ఇలా చేస్తారని కూడా కాదు.. కానీ ఏ రాష్ట్రాంలో చూసినా పోలీసులంటే సామాన్యులకు భయమే. ఎందుకో తెలియదు వారిని చూడగానే తప్పు చేయకున్నా కంటపడకుండా తప్పించుకోని పోయే జనాలే ఎక్కువ. పోలీసులపై ఈ విధమైన నెగెటివ్‌ ఫీలింగ్‌ జనాల్లో నాటుకుపోవడానికి ప్రభుత్వాలే కారణం కావొచ్చు. చెప్పింది చెయ్యకపోతే ట్రాన్స్‌ఫర్లు, చెప్పింది చేస్తూ పోతే ప్రజల చేతి చివాట్లు… అందుకే నిజాయితీపరులైన పోలీసుల బాధ వర్ణణాతీతం. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డగించడం, అవసరమైతే చేతికి, లాఠీలకు పని చెప్పడం ఏనాటి నుంచో ఉంది. గత ప్రభుత్వంలోనూ ఉంది.. ఈ ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని డబ్బా కొట్టుకునే అధికారుల మాటలు ఒకలా చేతలు మరొలా ఉంటాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అసలేం జరిగింది?
జయశంకర్ వర్సిటీలో పోలీసుల తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకున్న ఓ మహిల కానిస్టేబుల్‌ ఆమెను కింద పడేసింది. టూ వీలర్‌పై వెళ్తూ రోడ్డుపై పరుగెడుతున్న ఝాన్సి జుట్టుపట్టుకుని లాగింది కానిస్టేబుల్. దీంతో ఝాన్సీ కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడంపై విద్యార్థుల నిరసన చెబుతుండగా ఈ ఘటన జరిగింది. జీవో నెంబర్ 55 రద్దు చేయాలన్న డిమాండ్‌ను ఏబీవీపీ బలంగా వినిపిస్తోంది. ఓవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. పోలీసుల దౌర్జ‌న్యాలు… అక్ర‌మ కేసులు… అవ‌హేళ‌న‌లు కొత్తమీ కాదన్న కవిత.. ఇదే కాంగ్రెస్ మీద‌, ఇదే పోలీసుల మీద కొట్లాడి వ‌చ్చినోళ్లమన్నారు. తెలంగాణ తెచ్చినోళ్లమని.. కొట్లాడేందుకు రెడీగా ఉన్నామంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదేంటి ఆ పోలీసులే కదా?
సదరు మహిళా పోలీస్ చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఇక్కడ విడ్డూరమేంటంటే బీఆర్‌ఎస్‌ నాయకుల రియాక్షన్‌ హిపోక్రసీని తలపిస్తోంది. రెండు నెలల ముందు వరకు ఉన్న పోలీసులే కదా ఇప్పుడు కూడా ఉన్నారు. వీరంతా నిన్నగాక మొన్న రిక్రూట్ అయిన వారు కాదు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో అసలు పోలీసులంతా మంచిగా ఉన్నట్టు.. ఇలాంటి ఘటనలే జరగనట్టు ఉంది బీఆర్‌ఎస్‌ నేతల బిల్డప్‌ చూస్తుంటే. లాక్‌అప్‌ డెత్‌లు, ఎన్‌కౌంటర్లు గత ప్రభుత్వంలో జరగలేదా? ఏమో ఇప్పుడు గొంతుచించికుంటున్న గులాబీ నాయకులకే తెలియలి. ఇటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా పోలీసులు తప్పులు, దౌర్జన్యాలపై గళం విప్పిన కాంగ్రెస్‌.. ప్రస్తుత ఘటనపై ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అటు వర్శిటీ భూములు నిరంకుశగా లాక్కొవద్దని విద్యార్థులు 20 రోజులుగా మొత్తుకుంటున్నా కనీసం పట్టించుకోలేదు కాంగ్రెస్‌. ఇలా బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ది దొందుదొందుగానే కనిపిస్తోంది.

Also Read: ఎవరి కల..? ఎవరికి కల..? ఎప్పుడు కన్నారీ కల?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *